ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు విచారణ 16కి వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తనను ఈడీ కార్యాలయంలో విచారించడంపై అభ్యంతరం చెపుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ కేసుపై సోమవారం విచారణ జరిపింది. 

ఈ కేసులో విచారణకు హాజరు కావాలని కోరుతూ నోటీసులు పంపినా ఆమె కోర్టులో ఈ కేసుని సాకుగా చూపుతూ విచారణకు హాజరుకావడం లేదని ఈడీ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకి తెలియజేశారు. 

ఆమె తరపు వాదించిన సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్, ఈ కేసుపై తుది విచారణ జరపాలని, అది పూర్తయ్యేవరకు విచారణకు హాజరు కావాలంటూ కల్వకుంట్ల కవితకు నోటీసులు ఇవ్వవద్దని ఈడీని ఆదేశించాలని కోరారు. 

గతంలో ఈ కేసు విచారణ చేపట్టినప్పుడు ఈడీ ఆమెకు నోటీస్ ఇవ్వబోమని కోర్టుకు హామీ ఇచ్చిందని, కానీ తర్వాత మళ్ళీ నోటీస్ పంపించిందని కపిల్ సిబాల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసుకి సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించిన తర్వాత ఈనెల 16న మళ్ళీ విచారణ జరుపుతామని చెపుతూ ఈ కేసుని వాయిదా వేసింది.