తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సూచిస్తూ ‘టిఎస్’ని ఖరారు చేసింది. ఆ సమయంలో బిఆర్ఎస్ పార్టీ పేరు టిఆర్ఎస్ పార్టీగా ఉండేది కనుక పార్టీ పేరుకి కాస్త దగ్గరగా ఉండే ‘టిఎస్’ని కేసీఆర్ ఎంచుకున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.
తాము అధికారంలోకి వస్తే తెలంగాణను సూచిస్తూ ‘టిఎస్’ని ‘టిజి’గా మారుస్తామని చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ మాట చెప్పిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కనుక ఈరోజు మధ్యాహ్నం జరుగబోయే మంత్రివర్గ సమావేశంలో ‘టిఎస్’ని ‘టిజి’గా మారుస్తూ తీర్మానం చేసి ఆమోదిస్తారని సమాచారం.
ఒకవేళ ‘టిఎస్’ని ‘టిజి’గా మార్చితే ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, బోర్డులు, వివిద ప్రవేశపరీక్షలు, ప్రభుత్వం అధికారిక ముద్రలు, రాష్ట్రంలో రిజిస్టర్ అవుతున్న అన్ని వాహనాలకు ఇకపై ‘టిఎస్’కు బదులు ‘టిజి’ అని మార్చవలసి ఉంటుంది.
ఈరోజు సాయంత్రం మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత ప్రభుత్వం తరపున మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు లేదా మరొకరు మీడియాకు వివరించనున్నారు.