మాజీ ఉప ప్రధానమంత్రి, సీనియర్ బీజేపీ నేత లాల్ కృష్ణ అద్వానీకి మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న ప్రకటించడంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ తనదైన శైలిలో స్పందించారు.
ఆయన ప్రత్యేకంగా వ్యాఖ్యలు చేయలేదు కానీ ఓ పోలిటికల్ కార్టూన్ పోస్ట్ చేశారు. దానిలో అద్వానీ 1990 నుంచి 2014 వరకు కష్టపడి ప్రధాని కుర్చీని తయారుచేసుకుంటే 2014లో నరేంద్రమోడీ వచ్చి ఆ కుర్చీలో కూర్చుండిపోయిన్నట్లు చూపారు.
అద్వానీ 1990 నుంచి అయోధ్యలో బాబ్రీ మసీదు స్థానంలో రామ మందిరం నిర్మించాలంటూ చేసిన రధయాత్రలు, దేశంలో బీజేపీ బలపడేందుకు ఎంతగానో దోహదపడిందనే సంగతి అందరికీ తెలుసు.
కనుక అద్వానీ పదేళ్ళు శ్రమించి బీజేపీని బలోపేతం చేసి ప్రధాని పదవి చేపడదామనుకుంటే, 2014 సార్వత్రిక ఎన్నికలలో హటాత్తుగా నరేంద్రమోడీ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించి ప్రధాని అయిపోయారు. అద్వానీ తదితరులను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆ తర్వాత కధ అందరికీ తెలిసిందే. కనుక అద్వానీ కష్ట ఫలితాన్ని మోడీ అనుభవిస్తున్నారని ప్రకాష్ రాజ్ చెపుతున్నారు.