త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో 17 స్థానాలకు పోటీ చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు ఆహ్వానించగా భారీగా స్పందన వచ్చింది. శనివారం గడువు ముగిసేనాటికి మొత్తం 177 మంది 306 దరఖాస్తులు సమర్పించారు.
శనివారం ఒక్కరోజే 100కి పైగా దరఖాస్తులు అందిన్నట్లు గాంధీ భవన్‌లో వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకపోయినా టికెట్ల కోసం ఎప్పుడూ పోటీ ఉంటుంది కానీ ఈ స్థాయిలో ఎంపీ టికెట్ల కోసం పోటీ పడుతుండటం గమనిస్తే, వారందరూ ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నట్లే భావించవచ్చు.
కాంగ్రెస్ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో రిటైర్డ్ ప్రొఫెసర్లు, రిటైర్డ్ ఉన్నతాధికారులు, ఇంకా సర్వీసులో ఉన్నవారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నారు.
దరఖాస్తు చేసుకున్న ప్రముఖులు, వారి బంధువులు:
• ఖమ్మం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి నందిని,రేణుకా చౌదరి, వీ.హనుమంతరావు, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త వీవీసీ గ్రూప్ సంస్థల అధినేత వి.రాజేంద్ర ప్రసాద్, తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.గడల శ్రీనివాసరావు ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో భట్టి విక్రమార్క సతీమణి ఖమ్మం నుంచి 500 కార్లతో భారీ ర్యాలీతో గాంధీ భవన్‌కు వచ్చి దరఖాస్తు సమర్పించడం విశేషం.
• వరంగల్: మోత్కుపల్లి నర్సింహులు తదితరులు.
• నల్గొండ: జానారెడ్డి కుమారుడు రఘువీర్.
• మహబూబాబాద్: తెలుగువర్శిటీ రిజిస్ట్రార్ రమేష్ భట్టు తదితరులు.
• మల్కాజ్‌గిరి: నిర్మాత బండ్ల గణేశ్, సర్వే సత్యనారాయణ, పటేల్ రమేశ్ రెడ్డి, చామల కిరణ్ తదితరులు.
• పెద్దపల్లి: గడ్డం వివేక్ రామస్వామి కుమారుడు గడ్డం వంశీ
• భువనగిరి: పిసిసి ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి.
• సికింద్రాబాద్: డా.గడల శ్రీనివాసరావు, వేణుగోపాల స్వామి, డా.రవీంద్ర గౌడ్, విద్యా స్రవంతి, ఎంఆర్‌జీ వినోద్ రెడ్డి తదితరులు.
• నాగర్‌కర్నూల్: మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్, ఆయన కుమార్తె చంద్రప్రియ.