బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ కాదు: కేటీఆర్‌

త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలలో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌, మిత్రపక్షాలు కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. కానీ ఎన్నికల షెడ్యూల్ ఇంకా వెలువడక ముందు దానిలో నుంచి బిహార్‌కు చెందిన జేడీ (యు) బయటకు జారుకుని మళ్ళీ బీజేపీతో జత కట్టింది. 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (తృణమూల్ కాంగ్రెస్ పార్టీ) కూడా కూటమికి దూరంగా జరిగారు. మనీలాండరింగ్ కేసుతో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌ను ఈడీ అరెస్ట్ చేయడంతో జెఎంఎం పార్టీ కూడా నేడో రేపో కూటమికి గుడ్ బై చెప్పేయడం ఖాయమే. 

కనుక కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి రెండూ కూడా లోక్‌సభ ఎన్నికలలో బీజేపీని ఎదుర్కోగల పరిస్థితిలో లేవనే చెప్పవచ్చు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందిస్తూ, “జాతీయస్థాయిలో బీజేపీని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోలేదు. ఈసారి ఎన్నికలలో ఆ పార్టీకి ఉన్న 40 ఎంపీ సీట్లను కూడా తిరిగి దక్కించుకోలేకపోవచ్చనే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభిప్రాయంతో మా పార్టీ ఏకీభవిస్తుంది.

కాంగ్రెస్‌ పెద్దన్న వైఖరి కారణంగానే ఇండియా కూటమి విచ్ఛిన్నం అవుతోంది. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు కూటమికి దూరమవుతున్నారు. బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కానే కాదిప్పుడు. కేవలం ప్రాంతీయ పార్టీలకు మాత్రమే బీజేపీని నిలువరించగల శక్తి ఉంది,” అని అన్నారు.