ఆదివారం తెలంగాణ మంత్రివర్గ సమావేశం

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడే రాష్ట్రాల శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు కూడా నిర్వహిచడం ఆనవాయితీ. దాని కంటే ముందు మంత్రివర్గ సమావేశం నిర్వహించి రాష్ట్ర బడ్జెట్‌పై చర్చించి ఆమోదిస్తారు. కనుక ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాష్ట్ర సచివాలయంలో సిఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుందని సాధారణ పరిపాలన విభాగం ఓ సర్క్యులర్ జారీ చేసింది. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పధకాలను అమలుచేయాల్సి ఉంది. ముందుగా రూ.500కి గ్యాస్ సిలిండర్, మహిళలకు నెలకు రూ.2,500 పింఛన్ ప్రారంభిస్తామని మంత్రులు చెపుతున్నారు.

అలాగే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్, ప్రాజెక్టులకు బడ్జెట్‌లో నిధులు కేటాయింపు తదితర అంశాల గురించి కూడా రేపటి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సిఎం రేవంత్‌ రెడ్డి కూడా శుక్రవారం ఇంద్రవెల్లి సభలో వీటిని అమలుచేస్తామని హామీ ఇచ్చారు. కనుక రేపు జరుగబోయే మంత్రివర్గ సమావేశంలో వీటికి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.

ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.