రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లోని నాగోబా దేవాలయాన్ని సందర్శించుకుని పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయానికి గోపుర నిర్మాణానికి, ఆలయ ఆవరణలో ఇతర ఆలయాల నిర్మించేందుకు రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయాల నిర్మాణాలకు భూమిపూజ చేశారు.
జిల్లా మహిళా సంఘాలకు రూ.60.07 కోట్లు రుణాలు అందజేశారు. ఇంద్రవెల్లిలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాత రూ.38.20 కోట్లు వ్యయంతో నిర్మించబోతున్న అమరవీరుల స్మృతివనం, ఆ ప్రాంతంలో రోడ్లు, అవసరమైన కొన్ని భవనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు.
1981, ఏప్రిల్‌కు 20న పోలీసుల కాల్పులలో మృతి చెందిన 15 మంది అమరవీరుల కుటుంబాలకు సిఎం రేవంత్ రెడ్డి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్ళ నిర్మాణాలకు రూ.5 లక్షల చొప్పున నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇంద్రవెల్లి సభలో సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ, “కేసీఆర్ పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించారు. కానీ ఏనాడూ ఇక్కడకి వచ్చి మీ సమస్యలను అడిగి తెలుసుకోలేదు. కనీసం సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదు. కానీ మేము ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుని అన్ని విదాలుగా అభివృద్ధి చేసి చూపిస్తాం.
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, కుష్టి, సదర్మాట్ ప్రాజెక్టులను నిర్మిస్తాం. కడెం ప్రాజెక్టుకి మరమత్తులు చేయించి జిల్లా రైతులకు నీరు అందిస్తాం.
ధరణీ పోర్టల్ మాయతో భూములు కోల్పోయిన రైతులందరికీ మళ్ళీ వారి భూములు తిరిగి ఇస్తాము. ఉమ్మడి జిల్లాలో ప్రతీ ఆదివాసీ తండా, గూడేనికి బస్సు సౌకర్యం కల్పిస్తాము,” అని హామీ ఇచ్చారు.
ఇవి కాక రూ.500 గ్యాస్ సిలిండర్, 200 ఉచిత విద్యుత్ సరఫరా హామీలను అతి త్వరలోనే అమలుచేస్తామని చెప్పారు. కోర్టు కేసులు కారణంగా నిలిచిపోయిన పోలీస్ కానిస్టేబుల్ నియామకాలను రెండు వారాలలోగా పూర్తి చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే రాబోయే 12 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.