కేసీఆర్‌ మళ్ళీ సిఎం కావాలనుకుంటే నిత్యానంద స్వామిలా....

రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నిన్న అదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభలో ప్రసంగిస్తూ, మాజీ సిఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

“ఆరు నెలల్లో నా ప్రభుత్వాన్ని పడగొడతామని, కేసీఆర్‌ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటూ బెదిరిస్తారా? ఇదేమైనా లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టా... కూలిపోవడానికి?నువ్వు అవినీతికి పాల్పడ్డావు కనుకనే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గట్టిగా గాలి వీస్తే పడిపోతోంది. 

అయినా నా ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టేది?మాది ప్రజా ప్రభుత్వం. దీనిని పడగొట్టే ధైర్యం ఎవరికుంది? ఎవరైనా నా ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బెదిరిస్తే మూతి పళ్ళు రాల్తాయని హెచ్చరిస్తున్నాను. అయినా నా ప్రభుత్వాన్ని పడగొడితే ఊర్లలోనికి బిఆర్ఎస్ నేతలను రానిస్తారా? వస్తే వేపచెట్టుకి వ్రేలాడదీయండి.  

కేసీఆర్‌ మళ్ళీ ఈ జన్మలో తెలంగాణకు ముఖ్యమంత్రి కాలేరు. ఆయన తన ఫామ్‌హౌస్‌కి సిఎం కావచ్చు. మరీ ముచ్చటగా ఉంటే ఆయన అక్రమంగా సంపాదించిన సొమ్ముతో నిత్యానంద స్వామిలా ఎక్కడైనా ఓ ద్వీపం కొనుక్కొని దానికి తానే రాజునని ప్రకటించుకోవచ్చు తప్ప తెలంగాణకు సిఎం కాదు కదా... కనీసం మంత్రి కూడా కాలేరు.

రాష్ట్రంలో రైతులను, నిరుద్యోగులను, దళితులను, మైనార్టీలను ఇలా ఇన్ని వర్గాల ప్రజలను మోసం చేసి దోచుకున్న పాపాల భైరవుడివి నువ్వు. ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు?” అంటూ సిఎం రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ని తీవ్రంగా ఆక్షేపించారు.  

“కేసీఆర్‌కు ఎంతమంది ఎంపీలను ఇచ్చినా వారందరినీ మోడీ ప్రభుత్వం కోసమే ఉపయోగిస్తున్నారు. రేపు మళ్ళీ ఎంపీలను ఇస్తే వెళ్ళి మోడీ పంచనే చేరుతారు. అటువంటప్పుడు బిఆర్ఎస్‌కు మనం ఎంపీలను ఎందుకు ఇవ్వాలి?

దేశంలో బీజేపీకి ఎన్డీయే కూటమి ఉంది. మా కాంగ్రెస్‌కు ఇండియా కూటమి ఉంది. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలనీయము. ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదు. వాలితే తుపాకీ పెట్టి కాల్చేస్తాము.

మా పార్టీ ఎంపీలు మాతోనే ఉంటారు. తెలంగాణ రాష్ట్రం కోసమే పనిచేస్తారు. కనుక లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని,” సిఎం రేవంత్‌ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 (Video courtesy: V6)