ఝార్ఖండ్ సిఎంగా చంపాయ్ సొరేన్ ప్రమాణ స్వీకారం

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ను మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో, ఆ రాష్ట్రంలో రాజకీయ డ్రామా మొదలైంది. రాష్ట్రంలో తమ సంకీర్ణ ప్రభిత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కూలద్రోసి రాష్ట్రంలో బీజేపీ అధికారం కట్టబెట్టేందుకే ఈ కేసు పేరుతో కుట్ర పన్నిందని కాంగ్రెస్‌, జెఎంఎం, ఆర్జేడీ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

హేమంత్ సొరేన్ తన పదవికి రాజీనామా చేయడంతో, ఆయన ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా చేసిన చంపాయ్ సొరేన్‌ నేడు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాంచిలోని రాజ్‌భవన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్‌ సిపి రాధాకృష్ణన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్‌ తరపున ఆలంగీర్ ఆలం, ఆర్జేడీ తరపున సత్యానంద్ భోక్త కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 

ప్రభుత్వం ఏర్పాటుకి 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా చంపాయ్ సొరేన్‌కు 48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు తెలియజేశారు. కనుక ఈ నెల 12వ తేదీలోగా శాసనసభలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్‌ ఆదేశించారు.