కాంగ్రెస్‌ నేతల కంటే బండ్ల గణేశ్ ఎక్కువ ఆవేశపడిపోతున్నారే!

ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఎమ్మెల్యే అవ్వాలని చాలా ప్రయత్నించారు కానీ సాధ్యపడలేదు. కానీ ఆయన ఇప్పుడు ఫుల్ టైమ్ కాంగ్రెస్‌ కార్యకర్తగా మారిపోయిన్నట్లున్నారు. కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల కంటే ఆయనే ఎక్కువగా బిఆర్ఎస్ పార్టీ మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. 

తాజాగా కాంగ్రెస్‌ యూత్ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేన రెడ్డితో కలిసి ప్రెస్‌మీట్‌లో మాట్లాడినప్పుడు బండ్ల గణేశ్ బిఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. 

“రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు అందరూ ప్రజాభవన్‌, సచివాలయానికి వెళ్ళగలుగుతున్నారు. ముఖ్యమంత్రిని, మంత్రులను అందరూ కలవగలుగుతున్నారని యావత్ దేశ ప్రజలు చెప్పుకుంటుంటే, బిఆర్ఎస్ నేతలు ఈర్ష్యతో ఉడికిపోతున్నారు. 

రేవంత్‌ రెడ్డి రెండు నెలల పాలన చూస్తే రాష్ట్రంలో మరో పదేళ్ళపాటు సాగబోయే కాంగ్రెస్‌ పాలన ఏవిదంగా ఉండబోతోందో అర్దం చేసుకోవచ్చు,” అంటూ రేవంత్‌ రెడ్డిని, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వెనకేసుకు వస్తూ, బిఆర్ఎస్ పార్టీ మీద విరుచుకు పడ్డారు. 

కానీ యూత్ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేన రెడ్డి మంచి రాజకీయ అనుభవం ఉన్నవాడిలా చక్కగా మాట్లాడారు. ఉద్యోగాల భర్తీ, ఎన్నికల హామీల అమలు గురించి బిఆర్ఎస్ సోషల్ మీడియా టీం చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను, యువతని కోరారు. 

సిఎం రేవంత్‌ రెడ్డి జూన్ 2వ తేదీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ జారీ చేయించి ఏడాదిలోగా 2 లక్షల ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేస్తానని మాట ఇచ్చారని, ఆ ప్రకారం చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. కనుక యువత ఈ ఉద్యోగాలు సాధించడానికి అన్ని విదాలా తయారుగా ఉండాలని చెప్పారు. 

ఆరు గ్యారెంటీ పధకాలను వంద రోజులలో అమలుచేస్తామని సిఎం రేవంత్‌ రెడ్డితో సహా మంత్రులు అందరూ చెపుతూనే ఉన్నారని. ఇప్పటికే కొన్ని హామీలను అమలుచేశారని, మిగిలినవి కూడా తప్పకుండా గడువులోగా అమలుచేస్తారని చెప్పారు. కనుక వీటి గురించి కూడా బిఆర్ఎస్ సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని శివసేన రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.