ముఖ్యమంత్రి, మంత్రులను కలవద్దు: కేసీఆర్‌

బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ నిన్న గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బంజారాహిల్స్‌లోని తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఇటీవల సిఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆయన సున్నితంగా మందలించారు. కాంగ్రెస్‌ నేతల ఉచ్చులో చిక్కుకోకుండా ఎమ్మెల్యేలు అందరూ అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్‌ హితవు పలికారు.

 ముఖ్యమంత్రికి, మంత్రులకు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినతి పత్రాలు  ఇవ్వడంలో తప్పు కాదు కానీ దీని కోసం వారి కార్యాలయాలకు వెళ్ళి కలిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కనుక వారు ప్రజల మద్య ఉన్నప్పుడే కలిసి వినతి పత్రాలు ఇవ్వాలని కేసీఆర్‌ తన పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు.

బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందంటూ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, అది మనల్ని మానసికంగా దెబ్బతీసి పార్టీని బలహీనపరిచే ప్రయత్నమే అని కేసీఆర్‌ చెప్పారు.

లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి ఒకటి రెండు సీట్లు కూడా రావంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం కూడా అటువంటిదేనని, కానీ ఈసారి కూడా బిఆర్ఎస్ పార్టీ కనీసం 6-8 ఎంపీ సీట్లు తప్పకుండా గెలుచుకోగలదని తన సర్వేలలో తేలిందని కేసీఆర్‌ చెప్పారు. కనుక బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అందరూ ధైర్యంగా, కలిసికట్టుగా పనిచేస్తూ లోక్‌సభ ఎన్నికలలో పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవాలని కేసీఆర్‌ సూచించారు. 

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయడం అసాధ్యమని కనుక రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఈ ఉచ్చులో చిక్కుకుంటుందని అన్నారు. 

మన ప్రభుత్వం ఎటువంటి తప్పు, అవినీతికి పాల్పడలేదని కనుక కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలు, బెదిరింపులకు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కనుక పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు అందరూ ప్రజల మద్యే ఉంటూ కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కోవాలని కేసీఆర్‌ సూచించారు. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలు, బడ్జెట్‌ సమావేశాల గురించి కేసీఆర్‌ పార్టీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు.