మనీ లాండరింగ్ కేసులో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అరెస్ట్ అవడంతో ఆయన స్థానంలో జెఎంఎం సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రిగా చేస్తున్న చంపయ్ సొరేన్‌ను శాసనసభా పక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.
ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు 47 మంది ఎమ్మెల్యేల సంతకం చేసిఛ్కిన లేఖలకు గవర్నర్‌కు సమర్పించి, ప్రభుత్వం ఏర్పాటుకి ఆహ్వానించవలసిందిగా కోరారు. కానీ గవర్నర్ నుంచి పిలుపు రాకపోవడంతో తమ ఎమ్మెల్యేలను బీజేపీ ఎత్తుకుపోయే ప్రమాదం ఉందని బావిస్తున్న చంపయ్ సొరేన్, వారిని రెండు ఛార్టడ్ విమానాలలో హైదరాబాద్ పంపేందుకు ఏర్పాట్లు చేశారు.
ఝార్ఖండ్ శాసనసభలో మొత్తం 81 సీట్లు ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకి 41 సీట్లు అవసరం కాగా జెఎంఎం, కాంగ్రెస్ పార్టీలకు కలిపి 47 మంది ఎమ్మెల్యేలున్నారు. కనుక ప్రభుత్వం ఏర్పాటుకి ఎటువంటి ఇబ్బందీ లేదు. అయినా గవర్నర్ ఇంతవరకు చంపయ్ సొరేన్‌ను ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించలేదు.
తమ ఎమ్మెల్యేలను నయాన్నో భయాన్నో లొంగదీసుకునేందుకు గవర్నర్ బీజేపీకి సమయం ఇస్తున్నారని చంపయ్ సొరేన్ ఆరోపిస్తున్నారు. అందుకే బీజేపీ నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం మిత్రపక్షమైన కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణకు తమ ఎమ్మెల్యేలను తరలిస్తున్నారు.