కేసీఆర్‌పై కంచె ఐలయ్య సంచలన వ్యాఖ్యలు!

హైదరాబాద్‌, రవీంద్రభారతిలో బుధవారం ప్రజా గాయకుడు గద్దర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ కంచె ఐలయ్య, కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ప్రజాగాయకుడు గద్దర్‌ని బూతు పాటలు పాడుకునేవాడంటూ కేసీఆర్‌ అవహేళన చేశారని చెప్పారు. ఓసారి ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ని కలిసేందుకు తాను వెళితే, బయట 2-3 గంటలు ఎదురుచూసినా కేసీఆర్‌ లోనికి పిలవలేదని అని చెప్పారు. గద్దర్‌ని కూడా ఇదేవిదంగా కేసీఆర్‌ అవమానించారని ప్రొఫెసర్ కంచె ఐలయ్య చెప్పారు. 

కేసీఆర్‌ గద్దర్‌ని అవమానిస్తే, సిఎం రేవంత్‌ రెడ్డి గద్దర్ తొలి జయంతి రోజునే ఈ కార్యక్రమం నిర్వహించారని, తెల్లాపూర్‌లో తాను గద్దర్ విగ్రహం ఏర్పాటుకి అనుమతి కోరగానే అంగీకరించారని, గద్దర్ పేరిట కళాకారులకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారని, ఇందుకు తాను చాలా సంతోషిస్తున్నానని ప్రొఫెసర్ కంచె ఐలయ్య చెప్పారు. 

పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జ్యోతీరావు ఫూలే విగ్రహం పెట్టాలనే ఆలోచన చేయని కేసీఆర్‌, ఇప్పుడు ఫూలే విగ్రహం పెట్టాలని కూతురు కల్వకుంట్ల కవిత చేత భట్టి విక్రమార్కకు వినతి పత్రం ఇవ్వడం విచిత్రంగా ఉందన్నారు. 

కల్వకుంట్ల కవిత తనకు ఫోన్ చేసి, ఫూలే విగ్రహం ఏర్పాటు కోసం చేస్తున్న పోరాటంలో తమతో కలిసి రావాలని కోరుతూ నాకు గాలం వేయాలని ప్రయత్నించారని ప్రొఫెసర్ కంచె ఐలయ్య సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రుల సమక్షంలోనే చెప్పారు. 

తెలంగాణలో మేధావులు కేసీఆర్‌ పట్ల ఎంత ఆగ్రహంగా ఉన్నారో ప్రొఫెసర్ కంచె ఐలయ్య ప్రసంగాన్ని వింటే అర్దమవుతుంది. 

Photo and Video Courtesy: V6