మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నేడు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్‌లో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.
శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ తన ఇంట్లో కాలుజారి పడటంతో తుంటి ఎముక విరిగింది. తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత వైద్యుల సలహా మేరకు రెండు నెలలుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ, ఫిజియో థెరపీ చేయించుకుంటున్నారు. కనుక ఇంతకాలం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో నేడు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ ముఖ్య నేతలు వెంటరాగా, కేసీఆర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్‌కు వెళ్ళారు. అక్కడ ఆయన కేసీఆర్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. తర్వాత శాసనసభలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శాసనసభా పక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు.
సుమారు రెండు నెలల తర్వాత కేసీఆర్ తొలిసారిగా శాసనసభకు వస్తున్నట్లు తెలుసుకున్న ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకుని ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా, గజ్వేల్లో గెలిచారు కానీ కామారెడ్డిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.