శుక్రవారం నాగోబాని దర్శించుకోనున్న సిఎం రేవంత్‌ రెడ్డి

రేవంత్‌ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో శుక్రవారం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ముందుగా మండలంలోని కేస్లాపూర్‌లో నాగోబా ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత ఇంద్రవెల్లిలో అమర వీరుల స్మృతి వనానికి శంకుస్థాపన చేస్తారు. తర్వాత ఇంద్రవెల్లిలో బహిరంగ సభ నిర్వహించి లోక్‌సభ ఎన్నికలకు శంఖారావం పూరిస్తారు. 

ముఖ్యమంత్రి తొలిసారిగా జిల్లాకు వస్తుండటంతో జిల్లా మంత్రి సీతక్క స్వయంగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిఎం రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, జిల్లా ఉన్నతాధికారులు, కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొనబోతున్నారు. 

లోక్‌సభ ఎన్నికలలో 17 సీట్లలో కనీసం 12 సీట్లు సాధించాలని సిఎం రేవంత్‌ రెడ్డి లక్ష్యంగా నిర్దేశించి, పార్టీ నేతలను ఆ దిశలో నడిపిస్తున్నారు. ఇంద్రవెల్లిలో జరుగబోయేది ఎన్నికల సభ కనుక సిఎం రేవంత్‌ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ, దాని అధినేత కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావులతో పాటు వారి హయాంలో జరిగిన అవినీతి అక్రమాల గురించి తప్పకుండా ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేయడం ఖాయమే అని భావించవచ్చు.

నాగోబా జాతర ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 5 రోజుల పాటు జరుగుతుంది. జాతర మూడవ రోజున నాగోబా దర్బార్ జరుగుతుంది.