తెలంగాణ ఉద్యమాలలో కేసీఆర్‌తో భుజం భుజం కలిపి పోరాడినవారు ప్రొఫెసర్ కోదండరామ్ అని అందరికీ తెలుసు. అలాగే విద్యావేత్తగా, మేధావిగా సమాజంలో గౌరవం కలిగినవారు. అటువంటి వ్యక్తి కేసీఆర్ లేదా బిఆర్ఎస్ పార్టీ సర్టిఫికేట్ అవసరమా? అని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైతే హర్షించకపోగా హైకోర్టులో పిటిషన్ వేసి ప్రమాణస్వీకారం చేయనీయకుండా బిఆర్ఎస్ అడ్డుపడిందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ చెప్పులు మోసేవారికి ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేస్తారు కానీ విద్యావంతులు, తెలంగాణ కోసం పోరాడినవారిని గౌరవించారని మరోసారి నిరూపించుకున్నారని సిఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయినా ఆ పార్టీ నేతల తీరు మారలేదని సిఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎమ్మెల్సీగా సిఫార్సు చేసిన కుర్ర సత్యనారాయణ స్పందిస్తూ, “మా గురించి సిఎం రేవంత్ రెడ్డి ఈవిదంగా మాట్లాడటం చాలా బాధాకరం. నేను రాజకీయాలలో ఉన్నానని చెపుతూ నన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడానికి తిరస్కరించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఓ రాజకీయపార్టీకి అధ్యక్షుడైన ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఎలా నామినేట్ చేశారు? ఆయనకున్న అర్హతలు ఏమిటి? నాకు లేనివి ఏమిటి?
నేను గవర్నర్ బాధితుడిని. గవర్నర్ నాకు అన్యాయం చేశారని భావిస్తున్నాను. అందుకే న్యాయం కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశాను తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు,” అని అన్నారు.