నంది అవార్డులు కాదు... ఇక నుంచి గద్దర్ అవార్డులు!

తెలంగాణ ఉద్యమాలలో అనేకమంది కవులు, కళాకారులు పాల్గొనడమే కాకుండా తమ సాహిత్య, కళారూపాలతో ప్రజలలో పోరాటస్పూర్తిని రగిలించారు. కనుక తెలంగాణ ఏర్పడిన తర్వాత వారికి సముచిత గౌరవం లభిస్తుందనుకుంటే, వారిలో బిఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడతారనుకున్న కొద్ది మందిని తప్ప మిగిలినవారిని కేసీఆర్‌ విస్మరించారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ప్రతిష్టాలను కూడా ఇనుమడింపజేసే నంది అవార్డులను పక్కనపెట్టేశారు. ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నంది అవార్డులను పునరుద్దరించాలని సినీ ప్రముఖుల విజ్ఞప్తిపై కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 

బుధవారం రవీంద్ర భారతిలో ప్రముఖ ప్రజా గాయకుడు, సినీ నటుడు గద్దర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఎం రేవంత్‌ రెడ్డి నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరిట కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు అవార్డులు ఇస్తామని ప్రకటించారు.

ఇక నుంచి ఏటా గద్దరన్న జయంతి రోజున ఈ అవార్డులు ఇస్తామని చెప్పారు. త్వరలోనే దీని కొరకు జీవో జారీ చేస్తామని చెప్పారు. త్వరలో టాంక్ బండ్‌పై గద్దరన్న విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి గదరన్నతో తనకున్న అనుబంధం గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణకు చెందిన అటువంటి గొప్ప కళాకారుడిని గౌరవించుకుందామని అన్నారు.