హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన వాటిలో పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఒకటి. దానిలో డ్రైవర్లు, హోంగార్డులు, కానిస్టేబుల్స్, ఎస్సైలతో కలిపి మొత్తం 85 మంది పనిచేస్తున్నారు. సిటీ పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి వారందరిపై ఒకేసారి బదిలీ వేటు వేశారు.
ఈ పోలీస్ స్టేషన్ నుంచి కీలకమైన సమాచారం బయటకు చేరవేస్తున్నట్లు గుర్తించి, మొత్తం అందరినీ ఒకేసారి నగరంలో రిజర్వ్ ఆర్మ్ కార్యాలయానికి బదిలీ చేశారు. కనుక పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో అందరూ తక్షణమే రిజర్వ్ ఆర్మ్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
పోలీస్ శాఖలో బదిలీలు సర్వసాధారణమే కానీ ఇలా ఒకేసారి ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న వారందరినీ బదిలీ చేయడం చాలా అసాధారణమైన విషయమే. అందరినీ ఒకేసారి బదిలీ చేయడంతో పంజగుట్ట పోలీస్ స్టేషన్ మూతపడే ప్రమాదం ఉంటుంది. కనుక తక్షణమే ఇతర ప్రాంతాలు, పోలీస్ స్టేషన్ల నుంచి సిబ్బందిని అక్కడకు బదిలీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది. బహుశః ఈరోజు సాయంత్రంలోగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.