నేటి నుంచి ఫిబ్రవరి 9వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నందున ఇవే చివరి పార్లమెంట్ సమావేశాలు. కనుక ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది.
ఇది లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్నదే అయినప్పటికీ ఇది మధ్యంతర బడ్జెట్ కనుక దీనిలో పెద్దగా ప్రజాకర్షక పధకాలు, వరాలు ఏమీ ఉండకపోవచ్చు.
ఆనవాయితీ ప్రకారం, ఇవాళ్ళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగించడంతో బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. రేపు (గురువారం) ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడతారు. దీంతో వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రిగా నిర్మలా సీతారామన్ పేరు రికార్డులలో నిలిచిపోనుంది.
రేపు ఉభయ సభలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టి చర్చిస్తారు. అది ముగిసిన తర్వాత ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై ఉభయ సభలు చర్చిస్తాయి.
ఇవి లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి పార్లమెంట్ సమావేశాలు కనుక ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ మిత్రపక్షాలు పార్లమెంట్‌లో తమ గొంతు గట్టిగా వినిపించేందుకు ప్రయత్నించడం ఖాయం.
ముఖ్యంగా ఇటీవల ఇండియా కూటమి నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ని వేరు చేసి మళ్ళీ బీజేపీ కూటమిలో చేర్చుకోవడం, ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలపై కేసుల పేరుతో వేధిస్తుండటం వంటి అంశాలపై కాంగ్రెస్ మిత్రపక్షాలు మోడీ ప్రభుత్వంతో ఈ సమావేశాలలో పెద్ద యుద్ధమే చేయవచ్చు.