ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్యేలుగా నియమితులైన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ ఖాన్‌లకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. వారిద్దరినీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.
బిఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలని కేసీఆర్ ప్రభుత్వం సిఫార్సు చేస్తే, రాజకీయ నేపధ్యం ఉన్నవారిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయనని చెపుతూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు.
ఇప్పుడు రాజకీయ నేపధ్యమే ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ ఖాన్‌లను ఆమె ఎమ్మెల్సీలు ఆందించడంతో, బిఆర్ఎస్ నేతలు అభ్యంతరం చెపుతూ హైకోర్టుని ఆశ్రయించారు. గవర్నర్ తమకో న్యాయం, కాంగ్రెస్ నేతలకు మరో న్యాయం అన్నట్లు వ్యవహరించడం సరికాదని వారి తరపు న్యాయవాది వాదించారు.
దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేస్తూ అంతవరకు ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ ఖాన్ ఇద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయవద్దని ఆదేశించింది.
అయితే గవర్నర్ విచక్షణాధికారంతో ఎమ్మెల్సీలను నామినేట్ చేస్తుంటారు తప్ప ప్రభుత్వానికి లోబడి కాదు. కనుక గవర్నర్ వద్దనుకుంటే తిరస్కరించవచ్చు... నచ్చితే నియమించవచ్చు. తదుపరి విచారణలో హైకోర్టు కూడా బహుశః ఇదే చెపుతూ వారి పిటిషన్లను కొట్టివేసే అవకాశం కనిపిస్తోంది.