ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థలలో డైరెక్టర్లుగా కొనసాగుతున్న 11 మంది డైరెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బయటకు సాగనంపింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మాజీ సిఎం కేసీఆర్ వారిని ఆ పదవులలో నియమించి, నిబంధనలకు విరుద్దంగా వారి పదవీకాలం పొడిగించడంతో వారందరూ గత పదేళ్ళుగా ట్రాన్స్‌కో, జెన్‌కోలలో డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారిని బయటకు సాగనంపి వారి స్థానాలలో 8 మందిని భర్తీ చేసేందుకు, ట్రాన్స్‌కో, జెన్‌కోలో వేర్వేరుగా నోటిఫికేషన్స్ జారీ చేశాయి. ట్రాన్స్‌కోలో ముగ్గురు, జెన్‌కోలో ఐదుగురు డైరెక్టర్లను భర్తీ చేయనున్నాయి. ఈ పదవులకు తగిన అనుభవంతోపాటు 62 ఏళ్ళు వయోపరిమితి ఉండాలని నోటిఫికేషన్స్‌లో సూచించాయి.
గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో విద్యుత్ కొరతని అధిగమించేందుకని చెప్పి చాలా పాత సాంకేతిక పరిజ్ఞానంతో, చాలా భారీగా నిర్వహణ వ్యయం, చాలా భారీగా కాలుష్యం వెదజల్లే యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణానికి పూనుకుంది. అలాగే మార్కెట్లో అందుబాటులో ఉండే ధర కంటే చాలా ఎక్కువ ధర చెల్లించి ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది.
ఈ మూడింటిపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. ఇటువంటి నిర్ణయాలలో ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్లు కీలకపాత్ర పోషిస్తారు. కనుక వారు తొలగింపుకి బహుశః ఇదీ ఓ కారణమై ఉండవచ్చు.