తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ ఎన్నికల తర్వాత తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకొని రెండు నెలలుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కనుక ఎన్నికలలో గజ్వేల్ నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఇంతవరకు ప్రమాణస్వీకారం చేయలేకపోయారు.
అయితే ఇప్పుడు పూర్తిగా కోలుకొన్నందున ఫిబ్రవరి 1వ తేదీన ఆయన శాసనసభకు వచ్చి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్‌లో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనిని బిఆర్ఎస్ పార్టీ కూడా ధృవీకరించింది.
శాసనసభ ఎన్నికలలో కేసీఆర్ తొలిసారిగా గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేశారు. గజ్వేల్ బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్‌పై విజయం సాధించగలిగారు కానీ కామారెడ్డిలో బీజేపీ అభ్యర్ధి వెంకట రమణారెడ్డి చేతిలో ఓడిపోయారు.
కేసీఆర్ శస్త్రచికిత్స జరిగి పూర్తిగా కోలుకున్న తర్వాత తొలిసారిగా ఫిబ్రవరి 1వ తేదీన బయటకు వస్తున్నారు. ఫిబ్రవరి నుంచి ప్రతీరోజు తెలంగాణ భవన్‌కు వచ్చి జిల్లాల వారీగా పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. లోక్‌సభ ఎన్నికలు షెడ్యూల్ వెలువడిన తర్వాత కేసీఆర్ పూర్తిగా కోలుకుంటే ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.