బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం యూసఫ్ గూడా నుంచి జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ భవన్ వరకు ఆటో రిక్షాలో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయనతో పాటు బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్, మైనార్టీ సెల్ నాయకుడు షేక్ అబ్దుల్లా సొహైల్ ఆటోలో ప్రయాణించారు. వారు ముగ్గురూ యూసఫ్ గూడాలో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న తర్వాత ఆటో ఎక్కారు.
వారికి ప్రత్యేక భద్రత, కార్లు ఉండగా ఆటోరిక్షాలో ఎందుకు ప్రయాణించారో అందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పధకం ప్రవేశపెట్టి మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఆ మేరకు ఆదాయం కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఆటోడ్రైవర్లు తమ సమస్యని ప్రభుత్వం, సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళారు కూడా. కానీ ఇంతవరకు వారికి ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనుక కేటీఆర్ వారి సమస్యను ఈవిదంగా మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేందుకు ప్రయత్నించిన్నట్లు అర్దమవుతోంది.
తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ విలేఖరులతో మాట్లాడుతూ, “మహాలక్ష్మి పధకంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారింది. కనుక వారి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ప్రభుత్వం స్పందిచకుంటే వారి సమస్య పరిష్కరించే వరకు పోరాడుతాము,” అని అన్నారు.