బిహార్‌లోని జెడీ(యు) అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. దీంతో జేడీ(యు), కాంగ్రెస్, ఆర్‌జెడీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది.
ఇటీవలే ఆయన ఇండియా కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో కూడా తెగ తెంపులు చేసుకుని మళ్ళీ బీజేపీతో దోస్తీకి సిద్దమయ్యారు. కొద్ది సేపటి క్రితమే బీజేపీ, జేడీయూ ఎమ్మెల్యేలు సమావేశమయ్యి నితీష్ కుమార్‌కు మద్దతు ప్రకటించారు. వారి మద్దతు లేఖలను గవర్నర్‌కు సమర్పించి, ఈరోజూ సాయంత్రమే బిహార్ రాజధాని పాట్నాలో నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
బీజేపీ ఆయనకు మద్దతు ఇస్తున్నందుకు ఆ పార్టీ సీనియర్ నేతలు సుశీల్ మోడీకి, రేణూదేవిలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వబోతున్నారు. అలాగే బీజేపీకి స్పీకర్, రెండు డెప్యూటీ స్పీకర్ పదవులు, కొన్ని మంత్రి పదవులు కూడా ఇవ్వబోతున్నారు.
ప్రస్తుతం బిహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలో జెడియు, (లాలూ ప్రసాద్ యాదవ్), కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ నితీష్ కుమార్ కాంగ్రెస్, ఆర్‌జెడీలకు కటీఫ్ చెప్పేసి, నేడు తన పదవికి రాజీనామా చేసి, మళ్ళీ వెంటనే బీజేపీతో కలిసి నేటి సాయంత్రమే మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి తప్పుకోవడం, కాంగ్రెస్‌ను కాదని మళ్ళీ బీజేపీతో దోస్తీకి సిద్దపడటం వలన లోక్‌సభ ఎన్నికలకు ముందు వాటికి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు.