మేడారం జాతర పోస్టర్స్ విడుదల చేసిన సిఎం రేవంత్‌ రెడ్డి

ములుగు జిల్లా, మేడారంలో ప్రతీ రెండేళ్ళకు ఓసారి సమ్మక్క సారలమ్మల మేడారం మహా జాతర జరుగుతుంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరుగబోతోంది. దీనికి సంబంధించి సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులతో కలిసి శనివారం సచివాలయంలో పోస్టర్స్ విడుదల చేశారు. 

ఈసారి ములుగు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క మంత్రిగా ఉండటంతో ఆమె వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటూ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 

మేడారం జాతరకు సుమారు కోటి మంది వరకు భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. మహాలక్ష్మి పధకంలో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నందున ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కనుక జిల్లా అధికారులు చాలా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

మేడారంకు నడిపే ప్రత్యేక బస్సులలో మహిళలకు టికెట్లు వసూలు చేద్దామని, దాని వలన టిఎస్‌ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరుతుందని అధికారులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు విజ్ఞప్తి చేశారు. కానీ వారి ప్రతిపాదనను మంత్రులు తిరస్కరించారు.    

మేడారం జాతర సమయంలో వన దేవతలను దర్శించుకొని మొక్కులు తీర్చుకోవడం చాలా కష్టమవుతుందనే ఉద్దేశ్యంతో, గత 10-15 రోజుల నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి నిత్యం భారీ సంఖ్యలో భక్తులు మేడారంకు వస్తుండటంతో ఇప్పటికే రద్దీ ప్రారంభమైంది.