అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణ రాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్నారు. బిహార్‌లో అనూహ్యంగా రాజకీయ పరిణామాలు మారిపోవడంతో రేపటి పర్యటనను రద్దు చేసుకున్నారు. 

అమిత్ షా రేపు రాష్ట్రంలో కరీంనగర్‌, మహబూబ్ నగర్‌ జిల్లాలలో పర్యటించి చివరిగా రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం కొంగర్ కలాన్‌లో పార్టీ మండల అధ్యక్షులతో సమావేశం కావలసి ఉంది. కానీ ఆయన పర్యటన రద్దు కావడంతో ఆ కార్యక్రమాలన్నీ రద్దు అయ్యాయి. 

ఈసారి శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని ఓడించి తప్పకుండా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని గత మూడు నాలుగేళ్ళుగా బీజేపీ చెప్పుకొంది. కానీ జనసేనతో పొత్తు పెట్టుకొని పోటీ చేసినప్పటికీ శాసనసభ ఎన్నికలలో బీజేపీ కేవలం 8 సీట్లు మాత్రమే గెలవగలిగింది. కనుక త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో కనీసం 10-12 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో, అమిత్ షా తెలంగాణ బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దు అయ్యింది. రాష్ట్రంలో మళ్ళీ ఎప్పుడు పర్యటించబోయేది త్వరలోనే ప్రకటిస్తామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు.