కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతల మద్య మాటల యుద్ధం రోజురోజుకీ తీవ్రమవుతూనే ఉంది. సిఎం రేవంత్ రెడ్డిని ముఠా మేస్త్రి వంటివాడని బిఆర్ఎస్ విమర్శించగా, “అవును నేను తెలంగాణ రాష్ట్రాన్ని పునర్మించడానికి వచ్చిన మేస్త్రినే. త్వరలోనే ఇంద్రవెల్లిలో బహిరంగ సభ నిర్వహించి అక్కడే మీకు సమాధి కూడా నిర్మిస్తా,” అంటూ ఘాటుగా బదులిచ్చారు.
దానిపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు స్పందిస్తూ, “పెద్దలు ఏనాడో చెప్పారు... అంటూ కనకపు సింహాసనమున శునకమును గూర్చుండబెట్టిన దాని నీచబుద్ధి మారదు...” అంటూ సుమతీ శతకంలోని పద్యాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
దాంతో పాటు సిఎం రేవంత్ రెడ్డి తదితరులను ఉద్దేశ్యించి, “అధికారంలో ఉన్నామనే సంగతి మరిచిపోయి చాలా చవుకబారుగా, వెకిలిగా మాట్లాడుతున్నారు. మేము ఇంకా అధికారంలో ఉన్నామనుకుంటున్నామంటూ విమర్శిస్తున్నారు. అయితే వారు కూడా ఇంకా తాము ప్రతిపక్షంలో ఉన్నామనుకొంటుండటం వలననే మేము అధికారంలో ఉన్నామని వారు భావిస్తున్నట్లున్నారు. మమ్మల్ని విమర్శించే బదులు ప్రజలకు వారిచ్చిన 420 హామీలను అమలుచేయడంపై దృష్టి పెట్టి పనిచేస్తే బాగుంటుంది. వారు ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినా ఇచ్చిన ఆ 420 హామీలన్నిటినీ అమలు చేసే వరకు మేము వారి వెంటబడి నిలదీస్తూనే ఉంటాము,” అంటూ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
అయితే ముఖ్యమంత్రిని బంగారు సింహాసనం మీద కూర్చున్న కుక్కతో పోల్చడాన్ని నెటిజన్స్ కూడా తప్పు పడుతున్నారు. బిఆర్ఎస్ పార్టీ ఇటువంటి మిడిసిపాటు, అహంకారం వలననే ఎన్నికలలో ఓడిపోయినా కేటీఆర్ తీరు మారలేదంటూ విమర్శిస్తున్నారు.