సర్జరీ తర్వాత తొలిసారిగా కేసీఆర్‌ పార్లమెంటరీ సమావేశం

మాజీ సిఎం, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ, ప్రతీరోజూ ఫిజియో థెరపీ చేయించుకుంటున్న సంగతి తెలిసిందే.

 ఇవాళ్ళ తొలిసారిగా సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో పార్టీ ఎంపీలతో పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు, లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వర రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌, సీనియర్ నాయకుడు హరీష్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాలలో పార్టీ తరపున ప్రశ్నించాల్సిన అంశాలు, ఉభయసభలలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించి కేసీఆర్‌ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. 

కేసీఆర్‌ ఫిబ్రవరి నుంచి ప్రతీరోజూ తెలంగాణ భవన్‌కు వచ్చి వివిద జిల్లాల నుంచి వచ్చే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలతో ముఖాముఖీ సమావేశమయ్యి పార్టీకి సంబందించి అన్ని అంశాలపై చర్చించనున్నారు. కేసీఆర్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయినందున కేటీఆర్‌, హరీష్ రావు ఇద్దరూ లోక్‌సభ ఎన్నికలకు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.