నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ నేడు ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో తెలంగాణ శకటం, తెలంగాణ కళాకారులు పాల్గొన్నారు. అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’ అనే థీమ్‌తో రూపొందిన ఈ శకటంపై కుమురం భీమ్, రాంజీ గోండు, చాకలి ఐలమ్మల విగ్రహాలు ఏర్పాటు చేశారు. శకటానికి ఇరువైపులా కొమ్ముకోయ, గుస్సాడి కళాకారులు కొమ్ముబూరలు, డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ ముందుకు సాగుతుంటే చాలా చూడముచ్చటగా ఉంది.
కేసీఆర్ తెలంగాణ సిఎంగా ఉన్నప్పుడు రాజకీయ కారణాలతో ప్రధాని నరేంద్రమోడీతో శతృత్వం పెంచుకున్నందున గత నాలుగేళ్ళుగా గణతంత్ర దినోత్సవ వేడుకలలో తెలంగాణ శకటం పాల్గొనలేకపోయింది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు, ఈసారి గణతంత్ర వేడుకలలో తెలంగాణ శకటాన్ని అనుమతించవలసిందిగా కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించడంతో నేడు తెలంగాణ శకటం కనువిందు చేసింది.