కేటీఆర్‌గారూ... మీ నాన్నగారి పేరు ఖరాబు చేయొద్దు: బండ్ల

ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ ఇదివరకు పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ భజన చేస్తుండేవారు కానీ ఇప్పుడు సిఎం రేవంత్‌ రెడ్డి భజన చేస్తున్నారు. రేవంత్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌, హరీష్ రావులు చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై కాంగ్రెస్‌ మంత్రులు, నేతల కంటే ముందుగా, ఘాటుగా బండ్ల గణేశ్ ప్రతివిమర్శలు చేస్తుండటం విశేషం. 

ఆయన మీడియా ముందుకు వచ్చి మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ని ఉద్దేశ్యించి ఏమన్నారంటే, “నేను రాజకీయాల గురించి మాట్లాడకూడదనే అనుకున్నాను. కానీ మా కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద కేటీఆర్‌ చేస్తున్న విమర్శలను వింటూ ఉండలేకపోయాను. మా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొడతానంటారు. కేసీఆర్‌ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటారు. కానీ మరో 5 ఏళ్ళ వరకు రాష్ట్రంలో ఎన్నికలు జరుగవు కనుక మీకు అంత ఆత్రంగా ఉంటే మీరు ఎలాగూ బిఆర్ఎస్ పార్టీ అని పేరు పెట్టుకున్నారు కనుక త్వరలో ఎన్నికలు జరుగబోతున్న ఏపీ లేదా మహారాష్ట్రాలలో పోటీ చేసి గెలిచి అక్కడ ముఖ్యమంత్రి అవ్వండి. ఎవరు వద్దన్నారు.  

మా కాంగ్రెస్ పార్టీ కేవలం 1.8 శాతం ఓట్ల ఆధిక్యతతో అధికారంలోకి వచ్చిందని అవహేళన చేస్తున్నారు. కానీ మీ బిఆర్ఎస్ పార్టీ మొదటిసారి భారీ మెజార్టీతో గెలిచిందా? లేదు కదా?కేవలం 62 సీట్లతో అధికారంలోకి వచ్చి మా కాంగ్రెస్ పార్టీతో సహా టిడిపి ఎమ్మెల్యేలను కూడా అభివృద్ధి పేరుతో ఎత్తుకుపోయారు కదా?

మళ్ళీ రెండోసారి కూడా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఎత్తుకుపోయారు కదా?నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి సిఎం రేవంత్‌ రెడ్డిని కలిస్తే ఏదో కొంపలు అంటుకుపోయిన్నట్లు మాట్లాడుతున్నారు. మరి ఆనాడు మీరు చేసింది తప్పుగా అనిపించలేదా?

వారిపై తీవ్ర ఒత్తిడి చేసి బలవంతంగా ప్రెస్‌మీట్‌ పెట్టించి, వారితో మీరు వ్రాసిచ్చిన స్క్రిప్టుని చదివించారు? అంటే ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ రాష్ట్ర ప్రజలు, ఎమ్మెల్యేలు అందరూ మీ చెప్పుచేతల్లోనే ఉండాలని కోరుకుంటున్నారా? ఇప్పటికైనా ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడించారో తెలుసుకుని, మీ తప్పులు, లోపాలను సరిదిద్దుకుని మళ్ళీ ప్రజల వద్దకు వెళ్తే మంచిది.

నేను కేటీఆర్‌కి ఏమి విజ్ఞప్తి చేస్తున్నానంటే, మీరు నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతూ, మీ తండ్రిగారి పేరు చెడగొట్టకండి. మీకు ఏమైనా మానసిక సమస్యలు ఉన్నట్లయితే కేరళకు వెళ్ళి ఆయుర్వేద చికిత్స చేయించుకుంటే మంచిది,” అంటూ బండ్ల గణేశ్ దంచేశారు.

Video Courtesy: NTV