ఏపీ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు రాజకీయ పార్టీలలో చేరడం మొదలుపెట్టారు. ప్రముఖ హాస్య నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ... పృధ్వీ, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇద్దరూ బుధవారం హైదరాబాద్‌లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు.
వీరిలో నటుడు పృధ్వీ ఇదివరకు వైసీపిలో ఉండేవారు. జగన్ ఆయనకు టీటీడీ శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ పదవి కూడా ఇచ్చారు. కానీ పృధ్వీ ఛానల్లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగినితో ఫోన్లో మాట్లాడిన అశ్లీల సంభాషణ ఆడియో టేపులు బయటకు పొక్కడంతో జగన్ వెంటనే ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు.
ఆ తర్వాత ఏపీ సిఎం జగన్ ఆయనను పూర్తిగా పక్కన పెట్టేయడంతో క్రమంగా వైసీపికి దూరమవుతూ పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో’ సినిమాతో ఏపీ మంత్రి అంబటి రాంబాబుని అనుకరిస్తూ డాన్స్ చేశారు. అప్పటి నుంచి వైసీపిని విమర్శిస్తూ, జనసేనానికి దగ్గరవుతున్నారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయనకు పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు.
పవన్ కళ్యాణ్‌తో ఉన్న బలమైన అనుబంధం కారణంగా కొరియోగ్రాఫర్ షేక్ జానీ మాస్టర్ కూడా జనసేనలో చేరారు. కానీ వీరిద్దరికీ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్ టికెట్స్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు.