మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారమే 30 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్చులో ఉన్నారని, లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని సంచలన ప్రకటన చేశారు. అయితే ప్రత్యర్ధ పార్టీలను బలహీనపరిచేందుకు ఆడే ‘మైండ్ గేమ్స్’లో భాగంగా కూడా రాజకీయ నాయకులు ఇటువంటి ప్రకటనలు చేస్తుంటారు కనుక మంత్రి ప్రకటనను ఎవరూ సీరియస్‌గా తీసుకోకపోయి ఉండవచ్చు.
అయితే నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలవడం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పిన మాటలు నిజమని నిరూపిస్తున్నాయి.
మెదక్ జిల్లాలోని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నేతృత్వంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు నలుగురు సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
వారిలో సునీతా లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో, పార్టీలో పనిచేశారు. ఆమె నేతృత్వంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడంతో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు మొదలవబోతున్నట్లే భావించవచ్చు.
తాము మర్యాదపూర్వకంగానే సిఎం రేవంత్ రెడ్డిని కలిశామని, జిల్లాకు సంబందించిన అభివృధ్ది పనులు, నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్, భద్రత గురించి మాత్రమే సిఎం రేవంత్ రెడ్డితో చర్చించామని సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. రాజకీయాల గురించి ఎటువంటి చర్చా జరగలేదని చెప్పారు.
వారు నలుగురూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చెప్పకుండానే వెళ్ళి సిఎం రేవంత్ రెడ్డిని కలవడంతో వారు పార్టీ మారడం ఖాయమనే భావించవచ్చు. ముఖ్యమంత్రిని కలవడంపై నేడు మీడియాకు వివరణ ఇస్తామని సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు.