తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం ఉదయం నల్గొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్స్ నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ఛత్తీస్‌ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో జరిగిన అవకతవకలు విచారణలో బయటపడబోతున్నాయనే భయంతోనే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల ప్రజాధనం గంగపాలు చేశారు. కేసీఆర్ పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించినా నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ ఇళ్ళు వంటి అనేక హామీలను అమలుచేయకుండానే తప్పించుకున్నారు. కానీ మేము అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాక ముందే హామీలన్నీ ఎప్పుడు అమలుచేస్తారని బిఆర్ఎస్ నేతలు మమ్మల్ని ప్రశ్నిస్తుండటం సిగ్గుచేటు.
రాష్ట్రంలో ప్రజలను మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు బిఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఆ తర్వాత ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం కూడా ఖాయమే.
సుమారు 30 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్చులో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత వారు పార్టీ వీడే అవకాశం ఉంది,” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.