మా కారు సర్వీసింగ్ వెళ్ళింది: కేటీఆర్‌

శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ ఓటమిని ఆ పార్టీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇంకా అంగీకరించలేకపోతున్నారని అనిపిస్తోంది.

నేడు తెలంగాణ భవన్‌లో మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “చాలా స్వల్ప తేడాతో 14 సీట్లు కోల్పోయాము. ఓడిపోయాము. మనకి మరో 7-8 సీట్లు వచ్చినా రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడి ఉండేది. కానీ కాంగ్రెస్‌ అబద్దాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి గెలిచి అధికారంలోకి వచ్చింది.

ప్రస్తుతం మన కారు సర్వీసింగ్‌కు వెళ్ళింది అంతే. తిరిగివచ్చి లోక్‌సభ ఎన్నికలలో రెట్టింపు వేగంతో దూసుకుపోతుంది. బిఆర్ఎస్ పార్టీ మోడీకో, రేవంత్‌ రెడ్డికో భయపడే పార్టీ కాదు. తెలంగాణ ప్రయోజనాల కోసం మనం ఎవరితోనైనా పోరాడేందుకు ఎప్పుడూ సిద్దంగానే ఉన్నాము. 

తెలంగాణ ప్రజల గొంతు పార్లమెంటులో వినబడాలంటే, లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించుకోవాలి. అందుకోసం అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ కాంగ్రెస్‌, బీజేపీలను ఎదుర్కొందాము,” అని అన్నారు. 

ఇంతకాలం ప్రభుత్వం, పాలనపైనే ఎక్కువగా దృష్టి పెట్టడం వలన పార్టీకి పూర్తి సమయం కేటాయించలేకపోయిన మాట వాస్తవం. దాని వలన ఎన్నికలలో పార్టీ నష్టపోయింది. ఇక నుంచి ప్రతీ మూడు నెలలకూ ఒకసారి పార్టీ సమావేశాలు నిర్వహించుకుందాము,” అని కేటీఆర్‌ అన్నారు.