బిఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికలకు నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్‌లో సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల బిఆర్ఎస్ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి దావోస్, లండన్‌లో తమపై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, “బిఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి వంటివారిని చాలామందినే చూసింది. రేవంత్ రెడ్డి లాంటివారు అనేక మంది వస్తుంటారు పోతుంటారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత అదృశ్యమయ్యేది బిఆర్ఎస్ పార్టీ కాదు... కాంగ్రెస్ పార్టీయే. అప్పుడు ఆ పార్టీలోనే రేవంత్ రెడ్డి ఒక్కరే మహారాష్ట్ర సిఎం ఏక్ నాధ్ షిండేలా ఒంటరిగా మిగిలిపోతారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే బీజేపీకి కోవర్టుగా వ్యవహరిస్తున్నారు. అందుకే ప్రధాని నరేంద్రమోడీకి సన్నిహితుడైన గౌతమ్ అదానీతో దావోస్‌లో భేటీ అయ్యారు. వారిద్దరూ ఏమి మాటలాడుకున్నారో బయటపెట్టాలి.
కాంగ్రెస్ గెలిస్తే 200 యూనిట్ల లోపు విద్యుత్ ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చింది. కనుక జనవరి నెలలో 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడుకున్నవారు ఎవరూ బిల్లులు చెల్లించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికల సమయంలో మహాలక్ష్మి పధకం కింద మహిళలకు నెలకు రూ.2,500 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఎవరూ ఆ ఊసే ఎత్తడం లేదు. తక్షణం ఆ హామీని అమలుచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము,” అని కేటీఆర్ అన్నారు.