సిఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో అదానీ ఛైర్మన్ గౌతమ్ అదానీతో భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవడాన్ని మాజీ మంత్రి కేటీఆర్ తప్పు పట్టారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు.
తెలంగాణకు పెట్టుబడులు సాధించినందుకు సిఎం రేవంత్ రెడ్డిని అభినందించకపోగా కోడిగుడ్డుకి ఈకలు పీకే ప్రయత్నం చేసిన్నట్లు కేటీఆర్ మాట్లాడటం చాలా బాధాకరం. తెలంగాణ ప్రయోజనం కోసమే రేవంత్ రెడ్డి గౌతమ్ అదానీతో భేటీ అయ్యారు తప్ప తన సొంత పనుల కోసం కాదు కదా?
తెలంగాణ ధనిక రాష్ట్రమని బిఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటారు. కానీ మా చేతికి అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని అప్పజెప్పారు. తెలంగాణ ప్రభుత్వ ఆదాయంలో రూ.40,000 కోట్లు కేసీఆర్ హయాంలో చేసిన అప్పులకు వడ్డీలకే వెళ్ళిపోతోంది.
బిఆర్ఎస్ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉన్న ఎన్నికల హామీలను అమలుచేయకుండా దాటవేసి తప్పించుకుంది. కానీ మా ప్రభుత్వానికి నెలరోజులు కాకమునుపే హామీలు అమలుచేయాలని ఒత్తిడి చేస్తున్నారు.
ఇదివరకు రెండేళ్ళ పాలన తర్వాత మేము కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే పసికూన వంటి తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? అని ప్రశ్నించారు. మరిప్పుడు మా ప్రభుత్వానికి రెండు నెలలు కూడా కాకముందే హామీలన్నీ అమలుచేయాలని ఎలా నిలదీస్తున్నారు? మేము అధికారంలోకి వచ్చిన రెండో రోజునే రెండు హామీలను అమలుచేశాము కదా?
బిఆర్ఎస్ తరపున లోక్సభ ఎన్నికలలో పోటీ చేయడానికి ఆ పార్టీ సీనియర్ నేతలు భయపడుతున్నారు. బహుశః అందుకే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పోటీ చేస్తారని మీడియాకు లీకులు ఇస్తున్నట్లున్నారు.
ఈసారి సరైన వర్షాలు పడకపోవడం వలన నాగార్జున సాగర్లో నీటి నిలువలు తగ్గిపోయాయి. కృష్ణా బేసిన్లో నీళ్ళు లేకపోతే రెండో పంటకు మేము ఎక్కడ నుంచి నీళ్ళు తెచ్చి ఇవ్వగలము?” అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.