ఇంట్లో నడక ప్రాక్టీస్ చేస్తున్న కేసీఆర్‌: వీడియో

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొన్ని వారాల క్రితం తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఉద్యమ సమయంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను ముందుండి నడిపించిన ఆయన ఇప్పుడు ఫిజియో థెరపిస్ట్ సాయంతో మెల్లగా వాకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. బిఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ సంతోష్ కుమార్‌ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది క్షణాలలోనే వైరల్ అయ్యింది. 

బిఆర్ఎస్ పార్టీ శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఈ ప్రమాదం కారణంగా కేసీఆర్‌ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనలేకపోవడంతో ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్‌ ఇద్దరూ పార్టీ శ్రేణులకు ధైర్యం చెపుతూ, రేవంత్‌ ప్రభుత్వంతో పోరాడుతున్నారు.

లోక్‌సభ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. కనుక కేసీఆర్‌ మళ్ళీ ప్రజల మద్యకు ఎప్పుడు వస్తారా?అని ప్రజలు, పార్టీ శ్రేణులు అందరూ ఎదురుచూస్తున్నారు. వచ్చే నెల నుంచి కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలను కలుస్తారని కేటీఆర్‌ చెప్పారు.

ఈ వీడియో చూసిన తర్వాత కేసీఆర్‌ పూర్తిగా కోలుకుని త్వరలోనే తమ మద్యకు రాబోతున్నారనే నమ్మకం ఏర్పడుతుంది.         కేసీఆర్‌ వాకింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని విడుదల చేయడం కూడా బహుశః ఇందుకే అని భావించవచ్చు.