తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని తొలగించుకుని తీవ్రంగా నష్టపోయిన బీజేపీ, ఈసారి లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. చాలా కాలంగా ఖాళీగా ఉన్న తెలంగాణ సంస్థాగత కార్యదర్శి పదవిలో చంద్రశేఖర్‌ని నియమించింది. ఈయన కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో బీజేపీని గెలిపించి అధికారంలో వచ్చేందుకు చాలా కృషి చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చంద్రశేఖర్ పార్టీలో క్రమశిక్షణ పాటించని నేతల పట్ల చాలా కటినంగా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో క్రమశిక్షణే లోపించిందని, ఇటీవల పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయిన విక్రమ్ గౌడ్ బయటపెట్టారు.
పార్టీలో కొన్ని గ్రూపులు ఉన్నాయనని వాటిలో ఏదో ఓ గ్రూపులో చేరకపోతే పార్టీలో మనుగడ సాగించడం కష్టమని చెప్పారు. కనుక తెలంగాణ బీజేపీలో ఇటువంటి పరిస్థితులపై చంద్రశేఖర్ దృష్టి పెట్టే అవకాశం ఉంది.
కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ప్రతీ ఒక్క ఎంపీ సీటు బీజేపీకి చాలా ముఖ్యమే. తెలంగాణలో బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈసారి బిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాంగ్రెస్ ఇంకా నిలదొక్కుకోలేదు. కనుక మరిన్ని ఎంపీ సీట్లు గెలుచుకోవాలని భావిస్తూ చంద్రశేఖర్‌ని తెలంగాణకు పంపిన్నట్లుంది.