కాంగ్రెస్‌ హిందూ వ్యతిరేకి అందుకే అయోధ్య బాయ్‌కాట్!

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ పార్టీ లౌకికవాదం పేరుతో హిందూ వ్యతిరేకతని ప్రదర్శిస్తుంటుంది.

దేశంలోనే కోట్లాది హిందువులు అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చూడాలని తహతహలాడుతుంటే, కాంగ్రెస్‌ అధిష్టానానికి మేము ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపినా వచ్చేందుకు ఇష్టపడటం లేదు. 

ఇదొక ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమం మాత్రమే. కానీ ఈ కార్యక్రమానికి హాజరైతే తమ మైనార్టీ ఓటు బ్యాంకు కోల్పోతామని కాంగ్రెస్‌ నేతలు భయపడుతున్నారు తప్ప కోట్లాది హిందువుల మనోభావాలను గౌరవించాలని భావించడం లేదు. దీనిని కూడా రాజకీయ కోణంలో నుంచే చూస్తున్న కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మూల్యం చెల్లించుకొంటుందని చెప్పగలను.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 సదస్సుని ఇలాగే బాయ్‌కాట్ చేసింది. అఖిలపక్ష సమావేశానికి హాజరుకాలేదు. చివరికి ఎన్నికల కమీషన్ నిర్వహించిన సమావేశానికి కూడా కాంగ్రెస్‌ హాజరుకాలేదు. కాంగ్రెస్ పార్టీ తన స్థాయిని తానే తగ్గించుకుంటోంది,” అని కిషన్ రెడ్డి అన్నారు.