తెలంగాణ బీజేపీలో ఏదో గ్రూపులో ఉంటేనే మనుగడ!

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీ ఓటమి ముందే ఊహించారు కనుక ఆ పార్టీలో ఎవరూ పెద్దగా నిరాశ చెందిన్నట్లు కనపడలేదు. గతంలో ఒకే ఒక్క సీటు గెలుచుకుంటే ఈసారి 8 సీట్లు గెలుచుకున్నామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమర్ధించుకున్నారు.

లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలుచుకోవడం ఖాయమని మళ్ళీ కొత్త జోస్యం చెప్పుకుంటున్నారు కూడా. అయితే ఎన్నికలలో ఓటమి తర్వాత బీజేపీ శ్రేణులలో తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయాయి.

విజయశాంతి ఇప్పటికే పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా, బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌, రఘునందన్ రావు వంటి సీనియర్ నేతలు ఎవరూ ఇదివరకులా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం లేదు.

ఈ పరిస్థితిలో తెలంగాణలో బీజేపీ లోక్‌సభ సీట్లు ఎన్ని గెలుచుకుంటుందో... ఎలా గెలుచుకుంటుందో కిషన్‌రెడ్డే చెప్పాలి. 

పార్టీ పరిస్థితి ఇలా ఉంటే, పార్టీలో అంతర్గత సమస్యలు మరోలా ఉన్నాయని విక్రమ్ గౌడ్ బయటపెట్టారు. ఆయన పార్టీకి రాజీనామా చేస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. 

“బీజేపీలో కొత్తవారిని చేర్చుకునేందుకు చూపే శ్రద్ద వారు పార్టీలో చేరిన తర్వాత చూపించరు. పార్టీలో అంటరానివాళ్ళుగా ట్రీట్ చేస్తుంటారు. తెలంగాణ బీజేపీ క్రమశిక్షణకు మారు పేరు అని గొప్పలు చెప్పుకుంటారు. కానీ పార్టీలో కొన్ని గ్రూపులు ఉన్నాయి. పార్టీలో ఉండాలనుకుంటే తప్పనిసరిగా వాటిలో ఏదో ఓ గ్రూపులో చేరాల్సిందే. 

ఏమీ ఆశించకుండా పనిచేద్దామనుకుంటే పార్టీలో గుర్తింపు ఉండదు. గ్రూపు రాజకీయాలు చేసేవారికే గుర్తింపు ఉంటుంది. శాసనసభ ఎన్నికలలో ఓటమికి ఎవరూ నైతిక బాధ్యత వహించలేదు. ఓటమిపై ఇంతవరకు పార్టీలో సమీక్ష జరుగనే లేదు. ఇటువంటి పార్టీలో కొనసాగడం కష్టమని భావిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నాను,” అని విక్రమ్ గౌడ్ చెప్పారు.