గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లో అనేక సాంకేతిక లోపాలున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. వాటి వలన రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనుక ధరణీలో లోపాలను, సమస్యలను గుర్తించి సరిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం నలుగురు నిపుణులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. భూ పరిపాలన ప్రధాన కమీషనర్ నవీన్ మిత్తల్ ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కమిటీలో సభ్యులు:
1. సభ్యుడు: ఎం.కోదండ రెడ్డి (కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు)
2. సభ్యుడు: రేమండ్ పీటర్ (మాజీ ఐఏఎస్, భూచట్టాల నిపుణుడు)
3. సభ్యుడు: భూమి సునీల్ (నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో అనుబంద ఆచార్యుడు)
4. సభ్యుడు: బి. మధుసూధన్ (రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్, రెవెన్యూ చట్టాల నిపుణుడు).
వీరు నలుగురు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో పర్యటించి ధరణి పోర్టల్ వలన ఎదురవుతున్న ఇబ్బందులను స్వయంగా రైతులను, అధికారులను, సిబ్బందిని అడిగి తెలుసుకుంటారు. అలాగే ధరణీ పోర్టల్లోని సాంకేతిక లోపాలను కూడా గుర్తిస్తారు.
సమగ్ర అధ్యయనం తర్వాత వారిచ్చే నివేదిక, సిఫార్సుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ధరణీ పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు అవసరమైన విధివిధానాలు ఖరారు చేస్తుంది. ధరణీ పోర్టల్లో అవసరమైన మార్పులు చేర్పులు చేసిన తర్వాత దాని పేరుని ‘భూమాత’గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది.
ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు బహుశః 1-2 నెలలు సమయం పట్టవచ్చు. కనుక అంతవరకు యధా ప్రకారం ధరణీ పోర్టల్ ద్వారానే రిజిస్ట్రేషన్స్ ప్రక్రియని కొనసాగిస్తుంది.