సాగునీటి శాఖ కార్యాలయాలలో విజిలెన్స్ అధికారులు సోదాలు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు  కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్‌ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని పదేపదే ఆరోపించేవారు. ఆ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజిలో కొంత భాగం క్రుంగడంతో వారి ఆరోపణలకు బలం చేకూరిన్నట్లయింది.

దీంతో ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఆదేశం మేరకు విజిలన్స్ అధికారులు మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధతో సహా కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న సాగునీటి శాఖకు చెందిన 10 కార్యాలయాలపై ఏక కాలంలో సోదాలు నిర్వహించి, ప్రాజెక్టుకి సంబందించిన రికార్డులను స్వాధీనం చేసుకొని తీసుకువెళ్ళారు. సర్కిల్, డివిజనల్, ఈఎన్సీ, సీఈ, ఎస్ఈ కార్యాలయాలలో కూడా విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించి రికార్డులను స్వాధీనం చేసుకొని తీసుకు వెళ్ళారు. 

సాగునీటి శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలోనే 50 మంది విజిలెన్స్ అధికారులు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సోదాలు నిర్వహించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర విచారణ జరిపేందుకు ఒక సిట్టింగ్ జడ్జిని కేటాయించవలసిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ వ్రాసింది. హైకోర్టు నుంచి జవాబు వచ్చే లోగానే విజిలెన్స్ అధికారులను పంపించి రికార్డులను స్వాధీనం చేసుకుంది.

సిట్టింగ్ జడ్జి విచారణలో ప్రాజెక్టులో అవినీతిని నిగ్గు తేల్చేందుకు ఈ రికార్డులు చాలా కీలకంగా నిలుస్తాయని వేరే చెప్పక్కర్లేదు. ఈరోజు కూడా విజిలెన్స్ బృందాలు కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న సాగునీటి శాఖ కార్యాలయాలలో సోదాలు నిర్వహించబోతున్నాయి.