తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని రేసుల కోసం ఖర్చుచేయాలా?

గత ఏడాది కేసీఆర్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ నగరంలో ఫార్ములా-ఈ రేసింగ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. దాని నిర్వాహకులతో చేసుకున్నా ఒప్పందం ప్రకారం మళ్ళీ ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఫార్ములా-ఈ రేసింగ్ జరగవలసి ఉంది. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం దాని నిర్వహణపై ఆసక్తి చూపకపోవడంతో అది కాస్తా రద్దు అయ్యింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరించడం వలన హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజ్‌ దెబ్బతిందని, ఈ రేసింగ్ ద్వారా నగరానికి సుమారు రూ.600 కోట్ల ఆదాయం లభించేదని అది కూడా పోయిందని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. 

ఆయన ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందిస్తూ, “తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని ఇలా రేసుల కోసం ఖర్చుచేయాలా? ఒకటీ రెండూ కాదు... ఏకంగా రూ.110 కోట్లు ఎవరి చేతిలోనో పోసేయాలా? సచివాలయం బిజినెస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వం లేదా మునిసిపల్ శాఖ ఇటువంటి రేసులు నిర్వహించడానికి అనుమతి లేదనే సంగతి మాజీ మంత్రికి తెలుసా?ఓ ప్రైవేట్ సంస్థకు లబ్ధి కలిగించడానికే ఈ ఒప్పందం జరిగింది తప్ప దీనిలో తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ఒరిగిందేమీ లేదు. తెలంగాణ ప్రజల కష్టార్జితంలో ప్రతీ పైసాని మళ్ళీ వాళ్ళ కొరకే మా ప్రభుత్వం ఖర్చు చేస్తుంది,” అని చెప్పారు. 

గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఈ ఒప్పందంలో ప్రభుత్వం తరపున త్రైపాక్షిక ఒప్పందం ఎందుకు చేసుకొంది? నియమ నిబంధనలకు విరుద్దంగా హెచ్ఎండీఏ ఖాతా నుంచి రూ.54 కోట్లు ఫార్ములా-ఈ రేసింగ్ నిర్వాహకులకు బదిలీ చేసేందుకు ఎవరు అనుమతించారు? తెలియజేయాలని కోరుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆనాడు దీనిని పర్యవేక్షించిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు మంగళవారం మెమో కూడా జారీ చేసింది.