ప్రొఫెసర్ కోదండరామ్‌ మండలిలో ఉండాల్సిన వ్యక్తి: రేవంత్‌

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ, “నేను ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి మొన్న శాసనసభ ఎన్నికల వరకు అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, మేధావులు, వివిద వర్గాలకు చెందినవారు  నాకు ఎంతగానో తోడ్పడ్డారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడంలో వారందరూ చాలా కీలకపాత్ర పోషించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వారందరికీ సముచిత స్థానాలు కల్పించి గౌరవిస్తానని అప్పుడే మాట ఇచ్చాను. 

వారిలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ కూడా ఒకరు. ఆయన వంటి మేధావి శాసనమండలిలో ఉండాలి. ఒకప్పుడు మండలిలో చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి మేధావులు ఉండేవారు. వారి నుంచి నేను అనేక కొత్త విషయాలు నేర్చుకున్నాను. 

అయితే కేసీఆర్‌ దొర హయాంలో మండలిలో వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయి రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేసుకునే వారు పెరిగారు. ఎప్పుడైనా మండలి సమావేశానికి వెళితే అక్కడే ఏవో బిజినెస్ డీల్స్ జరుగుతున్నట్లు అనిపించేది. మండలిలో ఈ పరిస్థితిని మార్చి మళ్ళీ మేధావులతో కొలువు తీరేలా చేస్తాము. 

ముందుగా మా వెన్నంటి ఉండి మార్గదర్శనం చేసిన ప్రొఫెసర్ కోదండరామ్‌ని శాసనమండలిలోకి తీసుకువస్తాం. గవర్నర్‌ కోటాలో ఆమె కోరుకొన్న అర్హతలు కలిగిన ఇద్దరు ఎమ్మెల్సీలను సిఫార్సు చేస్తాం. 

అద్దంకి దయాకర్ వంటివారు ఇంకా చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపుకోసం ఎంతగానో కష్టపడ్డారు. వారందరికీ కూడా సముచిత పదవులతో గౌరవిస్తాను. వీలైతే ఈ జనవరి నెలాఖరులోగానే కార్పొరేషన్ ఛైర్మన్‌ పదవులన్నీ భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాను,” అని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు.