నరసింహన్ నా దూకుడు తగ్గించుకోమన్నారు: రేవంత్‌

తెలంగాణ మాజీ గవర్నర్‌ ఈఎస్ఎల్. నరసింహన్ శనివారం హైదరాబాద్‌ వచ్చినప్పుడు సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. సిఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా ఈ విషయం ట్విట్టర్‌లో తెలియజేస్తూ తమ ఫోటోని కూడా పోస్ట్ చేశారు. 

శనివారం సాయంత్రం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్‌ ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయం ప్రస్తావిస్తూ, “నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఓసారి ఆయనని కలిసినప్పుడు కాస్త దూకుడు తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. రాజకీయాలలో ఆచితూచి మాట్లాడుతూ, వ్యవహరిస్తూ ముందుకు సాగితే భవిష్యత్‌లో నేను ఉన్నతస్థాయికి ఎదుగుతానని చెప్పారు. ఆయన చెప్పిన్నట్లే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాను. నా జన్మకు ఇంతకంటే గొప్ప పదవి, వరం ఏముంటుంది? 

కాంగ్రెస్‌ ప్రభుత్వం నాకు అన్నీ ఇచ్చింది. కనుక ఇప్పుడు నేను తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఈయవలసి ఉంటుంది. కనుక నా పరిపాలన ఇతర రాష్ట్రాలకు సైతం రోల్ మోడల్ అనిపించేలా చేస్తాను. నా పరిపాలన చూసి ఇతర రాష్ట్రాలలో ప్రజలు సైతం మా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలి. మా ప్రభుత్వం గురించి చెప్పుకొని గర్వపడేలా చేస్తాను,” అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.