పాపం అంబటి రాయుడు... రాజకీయాలలో కూడా అవుట్!

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసిన తర్వాత ఏపీలో అధికార వైసీపి ఆయనకున్న స్టార్ ఇమేజ్ వాడుకోవాలనుకుంది. వైసీపిలో చేరితే గుంటూరు లోక్‌సభ టికెట్‌ ఇస్తామని ఆశజూపడంతో ఆయన ఇటీవలే వైసీపిలో చేరారు. ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి స్వయంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

కానీ వారం రోజులలోనే జగన్ మనసు మార్చుకొని నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలని తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకొని ఆయనను ఈసారి గుంటూరు నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని కోరారు. కానీ దానికి ఆయనకు నిరాకరించారు. 

తనకు గుంటూరు టికెట్‌ ఇస్తామని చెప్పి జగన్‌ వేరేవారికి దానిని ఆఫర్ చేస్తుండటంతో అంబటి రాయుడు షాక్ అయ్యారు. వెంటనే వైసీపిని వీడుతున్నానని ప్రకటించి “కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నాను. త్వరలోనే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా,” అంటూ అంబటి రాయుడు ట్వీట్‌ చేశారు.

దీంతో అంబటి రాయుడు ఇంకా బరిలో దిగక మునుపే వెనక్కు తిరగాల్సి వచ్చింది. మరి ఆయన తదుపరి కార్యాచరణ ఏమిటో?