గతంలో ధరణి పోర్టల్‌పై దాఖలైన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టినప్పుడు, దానిని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందా లేక రద్దు చేయాలనుకుంటోందా?అని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డిని ప్రశ్నిచింది. ఒకవేళ దానిని రద్దు చేయాలనుకుంటే గతంలో దానిపై తామిచ్చిన ఆదేశాలను అమలు గురించి విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఒకవేళ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ని కొనసాగించాలనుకుంటే, ఆ ఆదేశాల అమలుపై విచారణ కొనసాగించవలసి ఉంటుందని తెలిపింది.
అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి హైకోర్టు ప్రశ్నకు సమాధానమిస్తూ, దీనిపై ప్రభుత్వం ఏమనుకుంటుందో అడిగి తెలుసుకొని జవాబు ఇస్తానని కనుక తనకు కొంత సమయం ఇవ్వాల్సిందిగా కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 2కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి విచారణలో ప్రభుత్వ సమాధానాన్ని తప్పక తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి, దాని ఆధారంగానే రైతులకు సంక్షేమ పధకాలు అందించింది. అయితే దానిని అడ్డుపెట్టుకొనే బిఆర్ఎస్ నేతలు వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములను కబ్జాలు చేశారని, నిజానికి వారి కోసమే కేసీఆర్ ప్రభుత్వం ధరణీ పోర్టల్ ఏర్పాటు చేసిందని, కనుక తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ని రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కనుక ధరణి పోర్టల్‌ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేక రద్దు చేస్తుందా? తేల్చి చెప్పాల్సి ఉంది.