కాంగ్రెస్‌ హామీలు 420 అని చెపితే ఉలికిపాటు దేనికి?జగదీష్ రెడ్డి

కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల మద్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ‘కాంగ్రెస్‌ 420 హామీలు’ అంటూ బిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన బుక్లెట్‌పై కాంగ్రెస్‌ మంత్రులు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ తదితరులు స్పందిస్తూ బిఆర్ఎస్ పాలనలో అమలుచేయని హామీలను, చేసిన అవినీతిని గుర్తుచేస్తూ ఘాటుగా బదులిచ్చారు. 

వారికి బిఆర్ఎస్ తరపున మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మళ్ళీ అంతే ఘాటుగా బదులిచ్చారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “రేవంత్‌ రెడ్డితో సహా రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలెవరికీ తాము ఎన్ని హామీలు ఇచ్చామో తెలీదు. అదేదో ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నట్లు ప్రజలకు చదివి వినిపించేశారు.

కానీ వారిచ్చిన హామీలన్నిటినీ మేము లెక్కపెడితే సరిగ్గా 420 ఉన్నాయి. అందుకే 420 హామీలు అని చెప్పాము. కానీ 420 సంఖ్యని చూసి కాంగ్రెస్‌ మంత్రులు ఎందుకు భుజాలు తడుముకొంటున్నారు?

అది జస్ట్ ఒక సంఖ్య మాత్రమే కదా? అంటే తాము ప్రజలను మోసం చేస్తున్నామనే అపరాధ భావన వారిలో ఉండటం వలననే తామందరం 420 గాళ్ళమని వాళ్ళకు వాళ్ళు అనుకొంటే అది మా తప్పా? ఒకవేళ వాళ్ళిచ్చిన హామీలు 419, 421 ఉంటే మేము అదే సంఖ్య చెప్పేవాళ్ళం కదా?

మేము వాళ్ళని 420 గాళ్ళమని అనకపోయినా అన్నట్లు ఊహించేసుకొని ఎన్నికల కమీషన్‌కి ఫిర్యాదు చేసి మా పార్టీ గుర్తింపు రద్దు చేస్తామని బెదిరించడం ఇంకా హాస్యస్పదంగా ఉంది. అలా చేస్తే వాళ్ళ ప్రభుత్వం గురించి ఎన్నికల కమీషన్‌కు తెలియని కొత్త విషయం స్వయంగా చెప్పుకొన్నట్లవుతుంది! అయినా మా పార్టీని రద్దు చేయడానికి కాంగ్రెస్‌కు ఏమి హక్కు ఉంది?బిఆర్ఎస్ వద్దనుకొంటే ప్రజలే రద్దు చేస్తారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తాము ఇచ్చిన హామీలన్నిటినీ ఏవిదంగా అమలుచేయాలో తెలియకనే అబద్దాలు చెపుతూ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తోంది. 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడుకొంటే దానికి డబ్బు వసూలు చేయమని, అంతకు మించి ఒక్క యూనిట్ ఉంటే ఆ ఒక్క యూనిట్‌కు మాత్రమే బిల్లు చెల్లించాల్సి ఉంటుందని మంత్రులందరూ శాసనసభలో పదేపదే చెప్పారుగా? ప్రజలకు మేము అదే చెపుతున్నాము. మరి దానికి ఉలికిపాటు దేనికి?” అంటూ జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించారు.