నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ పట్టణంలో బిఆర్ఎస్ కౌన్సిలర్లు తమ సొంత పార్టీకే చెందిన ఆర్మూర్ ఛైర్ పర్సన్ పండిత్ వినీతకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కుర్చీలో నుంచి దించేసారు. ఆర్మూర్ పురపాలక మండలిలో మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉండగా వారిలో 30 మంది బిఆర్ఎస్ పార్టీకి చెందినవారే.
వారిలో 17 మంది, కాంగ్రెస్-1, మజ్లీస్-1, స్వతంత్రులు-2, బీజేపీకి చెందిన ముగ్గురు కలిసి పండిత్ వినీతకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ఈరోజు ఆర్డీవో వినోద్ కుమార్ పర్యవేక్షణలో ఓటింగ్ నిర్వహించారు. పండిత్ వినీత వర్గానికి చెందిన కౌన్సిలర్లు సమావేశానికి రాలేదు. హాజరైన సభ్యులు అందరూ అవిశ్వాస తీర్మానాన్ని బలపరచడంతో పండిత్ వినీత ఆర్మూర్ ఛైర్ పర్సన్ పదవి కోల్పోయారు. త్వరలోనే కొత్త ఛైర్ పర్సన్ ఎన్నుకొనేందుకు మళ్ళీ సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
అనంతరం ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “బిఆర్ఎస్ హయాంలో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అవినీతి పాలన సాగింది. మేము చేసిన పోరాటలతో ఆర్మూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేని ఓడించగలిగాము. ఇప్పుడు మునిసిపల్ ఛైర్ పర్సన్ని కూడా దించగలిగాము. బీజేపీ కౌన్సిలర్‌నే ఛైర్మన్‌గా ఎన్నుకొంటేనేఆర్మూర్ పట్టణం బాగుపడుతుంది,” అని అన్నారు.