కానిస్టేబుల్ ఉద్యోగాలకు హైకోర్టు లైన్ క్లియర్

తెలంగాణ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. ఈ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో నాలుగు ప్రశ్నలలో తప్పులు జరిగాయి కనుక మళ్ళీ మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలని హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుని జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావు, జస్టిస్ అభినంద్ కుమార్‌ షావిలితో కూడిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పక్కన పెట్టింది. 

రిక్రూట్‌మెంట్ బోర్డులు నిర్వహించే పరీక్షలలో ప్రశ్నలకు సంబంధించి ఎదురయ్యే ఇటువంటి సమస్యలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం సరికాదని, నిపుణుల కమిటీలే వీటిని పరిష్కారం కనుగొనడం సబబని   భావిస్తున్నామని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.

కనుక ఉస్మానియా యూనివర్సిటీకి అధ్వర్యంలో స్వతంత్రంగా పనిచేసే రెండు నిపుణుల కమిటీలను వెంటనే ఏర్పాటు చేసి అవి ఇచ్చే నివేదికల ఆధారంగా బోర్డు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఏది ఏమైనప్పటికీ నాలుగు వారాలలోగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియని పూర్తి చేయాలని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. 

పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షల ఫలితాలు గత ఏడాది అక్టోబర్ 4వ తేదీన వెలువడ్డాయి. మొత్తం 16,604 పోస్టులకు 15,750 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. వారిలో పురుషులు 12,866, మహిళలు 2,884 మంది ఉన్నారు. అప్పటి నుంచి వారందరూ నియామక పత్రాల కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటే, ఈ న్యాయ వివాదాల వలన ఇంత వరకు అందక తీవ్ర ఆందోళనతో, నిరాశ నిస్పృహలతో ఉన్నారు. 

హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తాజా తీర్పుతో వారందరికీ ఉపశమనం లభించింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలలో మంచి పేరు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తోంది కనుక వీలైనంత త్వరగానే ఈ ప్రక్రియని ముగించి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ నియామక పత్రాలు అందిస్తుందనే భావించవచ్చు.